బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు?

28 Aug, 2022 14:46 IST|Sakshi

గోవా: హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు. మృతికి కొద్ది గంటల ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే సోనాలి మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తామని తెలిపారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌. హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో ఫోగట్‌ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఈ మేరకు వెల్లడించారు సీఎం.  

‘హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నాతో మాట్లాడారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయను కలిసి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరిన క్రమంలో.. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం.’ అని తెలిపారు ప్రమోద్‌ సావంత్‌. సోనాలి ఫోగట్‌ కుటుంబ సభ్యులు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ను శనివారం కలిశారు. నటి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం.. సీబీఐ దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వానికి లేఖ రాస్తామని హరియాణా ముఖ‍్యమంత్రి కార్యాలయం తెలిపింది.

మరోకరి అరెస్ట్‌.. 
సోనాలి ఫోగట్‌ మృతి కేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్ట్‌ చేశారు గోవా పోలీసులు. నిందితులు సోనాలి వెళ్లిన క్లబ్‌ యజమాని, డ్రగ్‌ డీలర్‌ దత్తప్రసాద్‌ గోయంకర్‌, ఎడ్విన్‌ నన్స్‌గా తెలిపారు. తాజాగా ఆదివారం మరో డ్రగ్స్‌ సరఫరాదారుడిని అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

ఇదీ చదవండి: సోనాలి ఫోగట్‌ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసులా కావొద్దు

>
మరిన్ని వార్తలు