వీడియో: సోనాలి ఫోగట్‌ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది? ఎందుకు చంపారు?

27 Aug, 2022 08:07 IST|Sakshi

బీజేపీ నేత, హిందీ బిగ్‌బాస్‌ షో మాజీ కంటెస్టెంట్‌ సోనాలి ఫోగట్‌(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం సంచలనం సృష్టిస్తోంది.  కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె మరణానికి కారణమన్న కోణంలోనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసినా కారణాలేంటన్నది మాత్రం పోలీసులు ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్‌ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్‌ సంగ్వాన్, సుఖ్విందర్‌ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్‌ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్‌ చేశారు పోలీసులు.

అతికష్టం మీద సుధీర్‌ సాయంతో ఆమె రెస్టారెంట్‌లో నడుస్తూ కనిపించారు. ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు.

ఆ రెండున్నర గంటలు!
ఆధారాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు గోవా డీజీపీ జస్పాల్‌ సింగ్‌ తెలిపారు. కర్లీస్‌ రెస్టారెంట్‌ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆమెను సుధీర్‌ తన భుజం మీద మోసుకుంటూ టాయిలెట్‌కు తీసుకెళ్లాడు. వెనకాలే సుఖ్విందర్‌ కూడా ఉన్నారు. రెండున్నర గంటల తర్వాత.. అంజువా ఏరియాలోని సెయింట్‌ ఆంటోనీ ఆస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఉదయం ఏడు గంటలకు వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అయితే ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదు.

సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్‌ మృతి కేసు.. మర్డర్‌గా నిర్ధారణ కావడం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అత్యాచారానికి గురయ్యారని, బ్లాక్‌మెయిలింగ్‌తో సుధీర్‌, సుఖ్విందర్‌లపై ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. 

ఇదిలా ఉంటే.. సోనాలి ఫోగట్‌ హత్యకు కారణమైన గోవా కర్లీస్‌ రెస్టారెంట్‌ గతంలోనూ ఓ ఫారిన్‌ అమ్మాయి దారుణ హత్యాచారానికి కారణమైంది కూడా. ఆ సమయంలోనూ ‘డ్రగ్స్‌’ కోణంలోనే ఈ పబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. కాలక్రమంలో ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. గోవా మెడికల్‌ కాలేజీలో ఆమె మృతదేహానికి పరీక్షలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం బంధువులు, అభిమానుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. సోనాలి కూతురు సైతం పాడె మోసి కన్నీటి పర్యంతం అయ్యింది. అంతకు ముందు తన తల్లికి న్యాయం చేయాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. 

ఇదీ చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం..

మరిన్ని వార్తలు