అహ్మద్‌ పటేల్‌ మృతి.. సోనియా భావోద్వేగం

25 Nov, 2020 08:16 IST|Sakshi

అహ్మద్‌ భాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: ప్రధాని మోదీ

మిమ్మల్ని మిస్సవుతాం: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వాసానికి, అంకితభావానికి ఆయన మారుపేరు. పూర్తి నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు. సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు.

అహ్మద్‌ పటేల్‌కు ఉన్న దయాగుణమే ఇతరుల కంటే ఆయనను మరింత ప్రత్యేకంగా నిలిపింది’’  అని అహ్మద్‌ పటేల్‌తో పార్టీకి, తనకు ఉన్న అనుబంధాన్ని సోనియా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇక గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన అహ్మద్‌ పటేల్‌ సోనియా గాంధీ ఆంతరంగికుడిగా పేరొందిన విషయం విదితమే. కాగా కరోనా సోకడంతో పది రోజుల క్రితం(నవంబర్​ 15న) ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.(చదవండి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత)

అహ్మద్‌ భాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: ప్రధాని మోదీ
అహ్మద్‌ పటేల్‌ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘అహ్మద్‌ పటేల్‌ జీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితంలోని అత్యధిక కాలం ప్రజాసేవలోనే గడిపారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన కుమారుడు ఫైజల్‌తో మాట్లాడాను. అహ్మద్‌ భాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’’అని ప్రార్థించారు.

మిమ్మల్ని మిస్సవుతాం: రాహుల్‌ గాంధీ
‘‘ఇదొక విషాదకరమైన రోజు. కాంగ్రెస్‌ పార్టీ పిల్లర్‌ అహ్మద్‌ పటేల్‌. పార్టీ కోసమే ఆయన జీవితాన్ని ధారబోశారు. కఠిన సమయాల్లో వెన్నంటే ఉన్నారు. ఆయన ఒక వెలకట్టలేని ఆస్తి. మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతాం. ఫైజల్‌, ముంతాజ్‌, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా