Sonia Gandhi: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్‌.. 23న ఈడీ ముందుకు

20 Jun, 2022 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ జూన్ 12న కోవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

కాగా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాల్సి ఉంది  జూన్ 8న ఆమెను ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. అయితే జూన్ 1న సోనియాకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఈడీ నుంచి సమయం కావాలని కోరారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో జూన్ 23న ఏజెన్సీ ముందు హాజరుకావాలని సోనియా గాంధీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. మరోవైపు నేడు (సోమవారం) రాహుల్ గాంధీ నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. జూన్ 13 నుంచి 15వ తేదీన మూడు రోజుల పాటు ఆయన్ను ఈడీ ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు