పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం : సోనియా

26 Aug, 2020 16:50 IST|Sakshi

విపక్ష సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేష్‌ బాగేల్‌, హేమంత్‌ సోరేన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రేలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పాలిత సీఎంలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది.

రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ అన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదని ఆమె దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు నీట్‌ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్‌ పరీక్ష నిర్వహించడం సరికాదని రాహుల్‌ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. చదవండి : అప్పుడే కాంగ్రెస్‌ కొత్త సారథి ఎన్నిక!?

మరిన్ని వార్తలు