జీ–23 నేతలతో సోనియా భేటీ

20 Dec, 2020 03:54 IST|Sakshi

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు

5 గంటలపాటు చర్చ..హాజరైన రాహుల్, ప్రియాంక

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలో సమూల మార్పులు జరగాలని ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.  పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని, ఆగస్టులో సోనియాకు రాసిన లేఖలో అసమ్మతివాదులు అంచనా వేసినట్లు రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు తీవ్రమైన నష్టం జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ చేసిన విజ్ఞప్తి మేరకు సోనియాగాంధీ శనివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో రాహుల్, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ, హుడా, మనీష్‌ తివారీ, పవన్‌ కుమార్‌ బన్సల్, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, అంబికా సోని, శశిథరూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను సోనియా అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించలేదు?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఏదీ జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, నాయకత్వ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సోనియా గాంధీ సమావేశంలో స్పష్టం చేశారు. ఏకే ఆంటోనీ, హరీష్‌ రావత్‌ వంటి కొందరు సీనియర్లు మాత్రం రాహుల్‌ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరారని తెలిసింది. అయితే ఈ అంశాన్ని చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని రాహుల్‌ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఎన్నికల బాధ్యులపై మాటల దాడి
గుజరాత్‌ ఉప ఎన్నికలు, భిహార్‌ ఎన్నికలకు బాధ్యులుగా ఉన్న రాజీవ్‌ సతవ్, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాపై కొందరు  నేతలు పరోక్షంగా మాటల దాడి చేశారని తెలిసింది. పార్టీలోని 99.9% నేతలు రాహుల్‌నే పార్టీ అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారని సుర్జేవాలా చేసిన ప్రకటనపైనా అభ్యంతరం వ్యక్తం చేశారని వినికిడి.

>
మరిన్ని వార్తలు