Sonia Gandhi Rahul Gandhi: సేమ్ టు సేమ్‌.. ఈడీ విచారణలో రాహుల్, సోనియా ఒకే సమాధానాలు!

27 Jul, 2022 17:12 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజులు విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలనే చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

విచారణలో భాగంగా మొదటి రెండు రోజులు సోనియాను అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌(ఏజేఎల్‌), యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలనే అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ లావాదేవీలన్నింటినీ కాంగ్రెస్ దివంగత నేత మోతీలాల్ వోరానే చూసుకున్నట్లు సోనియా బదులిచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం కోశాధికారిగా పనిచేసిన మోతీలాల్ వోరా 2020లో కన్నుముశారు.

అంతకుమందు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పారని తెలిపాయి.

అలాగే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి ఈడీ అధికారులు గతంలో రాహుల్‌ను ప్రశ్నించగా..  అధి లాభాపేక్ష లేని సంస్థ అని దాని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన సమాధానం చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు సోనియా గాంధీ నోటి వెంట కూడా ఇవే సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నాయి.

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని జూన్‌లో 50 గంటలపాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు.  ఇప్పుడు సోనియా గాంధీని మూడు రోజుల పాటు 10 గంటలకుపైగా విచారించారు. ఈమె కూడా జూన్‌లోనే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికి కరోనా కారణంగా అధికారులను సమయం కోరడంతో వారు అంగీకరించారు.
చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది

మరిన్ని వార్తలు