కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు

27 Sep, 2022 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదివికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ చాలా కష్టాలనే చవిచూస్తోంది. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌కు మద్దతిస్తున్న​ ఎమ్మెల్యేల తిరుగాబాటుతో కాంగ్రెస్‌ పార్టీ ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో ఆశోక్‌ గెహ్లాట్‌ పోటీ చేస్తారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో  ఈ కష్టకాలం నుంచే గట్టేక్కించమంటూ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు ఏకే ఆంటోనికి ఆదేశాలు జారీ చేశారు.

81 ఏళ్ల ఏకే ఆంటోని మాజీ రక్షణ మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన..  పార్టీ అగ్రనాయకులలో ఒకరు. ఆయనకు రాజకీయంగా మంచి క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. అందువల్ల ఇతర పార్టీ నేతలు కూడా ఆయన్ను ఎంతో గౌరవప్రదంగా చూస్తుంటారు. అందువల్ల ఈ కష్టకాలంలో సోనియా గాంధీ చిరకాల ఆప్తమిత్రుడు అయిన ఏకే ఆంటోనిని గుర్తు చేసుకున్నారు. తక్షణమే కలవాల్సిందిగా ఆయనకు హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏకే ఆంటోని ఈ సాయంత్రానికే కేరళ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.

ఈ రోజు రాత్రికే సోనియగాంధీతో ఆయన భేటీకానున్నట్ల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రసుతం రాజస్తాన్‌లో సచిన్‌ పైలెట్‌ని ముఖ్యమంత్రి చేస్తే రాజీనామా చేస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లు  రాజస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి సోనియా గాంధీకి లిఖితపూర్వకంగా నివేదికను సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ ఆశోక్‌ గెహ్లాట్‌ మద్దతుదారులపై క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

(చదవండి: ఇదేం ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా గెహ్లాట్! కానీ..)

మరిన్ని వార్తలు