పొలిటికల్‌ ఎంట్రీ: దాదా భేటీపై రాజకీయ దుమారం

28 Dec, 2020 16:31 IST|Sakshi

కోల్‌కత్తా : మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతల వరుస పర్యటనలతో కోల్‌కత్తా వీధుల్లో కోలాహాలం నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం బెంగాల్‌లో పర్యటించి.. తొలి విడత ప్రచారాన్ని సైతం ముగించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం ఈ ఎన్నికలతో ఎంతో  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలను రాబట్టి.. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చిన కమలదళం అసెంబ్లీపై గురిపెట్టింది. టీఎంసీ కీలక నేతలకు గాలం వేస్తూ వ్యూహత్మకంగా వ్యవరిస్తోంది.

మరోవైపు పార్టీలకు అతీతంగా ఓటర్లను ఆకర్శించే నాయకులు, వ్యక్తులపై దృష్టి కేంద్రీకరించింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఒక్కొక్కరి మద్దతు కూడగడుతోంది. ఇక ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు‌ సౌరబ్‌ గంగూలీ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌తో ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశం కావడంతో కలకలం రేపుతోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ గవర్నర్‌తో దాదా భేటీ కావడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చసాగుతోంది. గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఇది వరకే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున బెంగాల్‌ అసెంబ్లీకి దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సైతం సాగింది.

ఒకవేళ గంగూలీ బరిలో నిలవకపోతే అతని భార్యను పోటీలో నిలపుతారని  వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీని  ఎంపిక చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ తరుణంలోనే గవర్నర్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారని వార్తలు రావడంతో ట్విటర్‌ వేదికగా గవర్నర్‌ స్పందించారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పారు. ప్రతిష్టాత్మక ఈడెన్‌ గార్డెన్‌ మైదానాన్ని సందర్శించాల్సిందిగా గంగూలీ కోరినట్లు గవర్నర్‌ వివరించారు. దాదా కోరిక మేరకు త్వరలోనే ఈడెన్‌ను సందర్శిస్తానని పేర్కొన్నారు. గవర్నర్‌ వివరణతో ‘బెంగాల్ టైగర్‌’ రాజకీయ రంగ ప్రవేశం వార్తలకు తాత్కాలికంగా పులిస్టాప్‌ పడింది.

మరిన్ని వార్తలు