చైనాకు భారత్‌ గట్టి వార్నింగ్‌

25 Sep, 2020 18:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్‌, చైనాకు స్పష్టం చేసింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) కవ్వింపులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాస్తవాధీన రేఖను దాటి భారత స్థావరాల వైపు చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తే గట్టిగా సమాధానం ఇస్తామని పేర్కొంది. ఒప్పందాలు అతిక్రమించి ముందుకు వచ్చినట్లయితే ఆత్మరక్షణకై కాల్పులకు దిగేందుకు తమ సైనికులు వెనుకాడబోరని హెచ్చరికలు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గల్వాన్‌ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న నాటి నుంచి భారత్‌- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దఫాల చర్చల అనంతరం బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. అయితే డ్రాగన్‌ ఆర్మీ మాత్రం కొన్ని ప్రదేశాల్లో దుందుడుగానే వ్యవహరిస్తోంది.(చదవండి: విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం)

ఈ నేపథ్యంలో దేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ.. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో చైనా ఆర్మీ అదే మొండివైఖరి ప్రదర్శిస్తే భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అన్ని ఏరియాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డ్రాగన్‌ ఆర్మీకి స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు