Covid New Variant (C.1.2): రూపం మార్చుకున్న కరోనా.. టీకా రక్షణను దాటుకుని..

31 Aug, 2021 04:59 IST|Sakshi

దక్షిణాఫ్రికాలో కనుగొన్న సైంటిస్టులు

కోవిడ్‌ సీ.1.2గా గుర్తింపు

న్యూఢిల్లీ: అందరూ భయపడుతున్నట్లే కరోనా వైరస్‌ మరోమారు కొత్త రూపు దాల్చింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తించామని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌(ఎన్‌ఐసీడీ) సైంటిస్టులు తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్‌ఐఎస్‌పీ సంస్థతో కలిసి జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్‌ సీ.1.2 బయటపడిందని తెలిపారు. మేలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని, ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో దీని జాడలు కనిపించాయని హెచ్చరించారు.
(చదవండి: ఇది మన విజయం; అమెరికాతో పాటు ఇతర దేశాలతో కూడా)

ఈ వైరస్‌ కరోనా టీకాలు కల్పించే రక్షణను దాటుకొని సోకుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్‌లో అధిక ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఉన్నాయని ఎన్‌ఐసీడీ సైంటిస్టులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో ప్రతినెలా ఈ వేరియంట్‌ జీనోమ్స్‌ సంఖ్య పెరుగుతూవస్తోందని అధ్యయనం వెల్లడించింది. గతంలో బీటా, డెల్టా వేరియంట్లలో కూడా జీనోమ్స్‌ ఇలాగే పెరిగాయని తెలిపింది. కొత్తగా కనుగొన్న వేరియంట్‌లో మ్యుటేషన్‌ రేటు సంవత్సరానికి 41.8 శాతమని, ఇతర వేరియంట్ల మ్యుటేషన్‌రేటు కన్నా ఇది దాదాపు రెట్టింపని అధ్యయనం వివరించింది.

సగానికిపైగా సీ.1.2 సీక్వెన్సుల్లో 14 మ్యుటేషన్లున్నాయని, ఇతర స్వీక్వెన్సుల్లో అదనపు మ్యుటేషన్లు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కొత్త వేరియంట్‌ స్పైక్‌ (కొమ్ము) ప్రాంతంలో జరుగుతున్న మ్యుటేషన్లలో 52 శాతం గత వేరియంట్లలో కనిపించినవేనని, మిగిలినవి కొత్త మ్యుటేషన్లని పేర్కొంది. స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారానే కరోనా వైరస్‌ మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇప్పుడున్న పలు వ్యాక్సిన్లు ఈ స్పైక్‌ప్రాంతాన్నే టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ఈ వేరియంట్‌లో కనిపిస్తున్న ఎన్‌ 440కే, వై 449హెచ్‌ మ్యుటేషన్లు కొన్ని యాంటీబాడీల నుంచి తప్పించుకొని పోయేందుకు ఉపయోగపడేవని సైంటిస్టులు వివరించారు. ఈ కొత్త మ్యుటేషన్లు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లలో లేవని, సీ.1.2లో మాత్రమే కనిపించే వీటితో క్లాస్‌3 యాంటీబాడీలను వైరస్‌ తప్పించుకోగలదని(ఇమ్యూన్‌ ఎస్కేప్‌) తెలిపారు.
(చదవండి: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు)

మరిన్ని వార్తలు