రైల్వే అధికారుల సెలూన్‌ జర్నీ.. ఖజానాకు కత్తెర

7 May, 2021 10:12 IST|Sakshi

సెలూన్‌ జర్నీలతో హల్‌చల్‌

రైల్వే అధికారుల  ప్రయాణం అత్యంత ఖరీదు వ్యవహారం

అధికారిక పర్యటనల పేరుతో విహారయాత్రలు

గంటకు రూ.2,500 చొప్పున నిర్వహణ ఖర్చు

రాజ దర్పం కోసం  రైల్వే ఖజానాకు కత్తెర

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే అధికారుల  ప్రయాణం  అత్యంత ఖరీదు వ్యవహారంగా మారింది. కోవిడ్‌ ఆంక్షల దృష్ట్యా రెగ్యులర్‌ రైళ్లను, ప్యాసింజర్‌ రైళ్లను పక్కన పెట్టి  సామాన్య ప్రయాణికులకు  రైల్వే సేవలను  దూరం  చేసిన  అధికారులు తాము మాత్రం విలాసవంతమైన సెలూన్‌ కోచ్‌లలో విహరిస్తున్నట్లు  ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు తనిఖీల్లో భాగంగా తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం ఈ సెలూన్‌లను వినియోగిస్తుండగా .. మరికొందరు ఎలాంటి తనిఖీలు లేకుండానే  వీటిని వినియోగించుకుంటున్నట్లు సమాచారం.

రాజసాన్ని, విలాసాన్ని ప్రతిబింబించే  సెలూన్‌ కోచ్‌లను ఉన్నతాధికారులు  తమ అధికారిక పర్యటనల  కోసం వినియోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ  ‘హోమ్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట  ప్రయాణికులకు సైతం వాటిని అందుబాటులోకి తేవాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పెళ్లిళ్లు, వేడుకలు, ఇంటిల్లిపాది కలిసి  వెళ్లే పర్యటనల కోసం  ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ ద్వారా సెలూన్‌లను రిజర్వ్‌ చేసుకొనే సదుపాయం ఉంది. బ్రిటీష్‌ కాలం నుంచి ఇటీవల వరకు అధికారులకే పరిమితమైన సెలూన్‌లను మొదటిసారి  ప్రయాణికుల వినియోగింలోకి తెచ్చారు. కానీ ఒకవైపు కోవిడ్‌  ఉధృతి, మరోవైపు సెలూన్‌ ప్యాకేజీలపైన  పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగంలోకి రాలేదు.

రైల్వేపై ఆర్ధిక భారం
రైళ్ల నిర్వహణ, వనరుల వినియోగంలో  పారదర్శకతను పాటించే అధికారులు సెలూన్‌ ప్రయాణాల పేరిట మాత్రం రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం. ఒక ఉన్నతాధికారి ఒకసారి సెలూన్‌ జర్నీ చేసేందుకు అయ్యే ఖర్చుతో విమానంలో ఎగ్జిక్యూటీవ్‌  జర్నీ చేయవచ్చునని కార్మిక సంఘం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు. ఏసీ బోగీ అయిన ఈ సెలూన్‌లో రెండు బెడ్‌ రూమ్‌లు, ఒక లివింగ్‌ రూమ్, ఒక కిచెన్, మరో నలుగురు ప్రయాణం చేసేందుకు వీలుగా పడకలు  ఉంటాయి. సకల సదుపాయాలు ఉన్న ఈ బోగీ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఆర్‌పీఎఫ్‌  భద్రత ఎలాగూ ఉంటుంది. వెరసి ఒక సెలూన్‌ వినియోగానికి  గంటకు రూ.2,500 చొప్పున నిర్వహణ భారం పడుతుంది. సిబ్బంది ట్రావెలింగ్‌ అలవెన్సులు, ఇతరత్రా ఖర్చులన్నీ అదనం. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, విజయవాడ, కర్నూలు, విశాఖ,  షిర్డీ, ఊటీ, ఢిల్లీ తదితర ప్రాంతాలకు  రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తున్నారు. 

‘రాయల్‌’ జర్నీ కోసమేనా...

బ్రిటీష్‌  కాలం నుంచి  రైల్వే అధికారులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. జనరల్‌ మేనేజర్, డివిజనల్‌ రైల్వే మేనేజర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులకు పనిచేసే నగరంలో బంగళాలతో పాటు బంగళా ఫ్యూన్‌లను  ఏర్పాటు చేశారు. అలాగే ఈ  తరహా సకల సదుపాయాలు కలిగిన విలాసవంతమైన  సెలూన్‌లను అందుబాటులో ఉంచారు. రాయల్‌ సంస్కృతిని ప్రతిబింబించే  ఈ ప్రత్యేక సదుపాయాలపైన  రైల్వేశాఖ  ఆంక్షలు విధించింది. కానీ కొంతమంది  అధికారులు వీటిని ఖాతరు చేయడం లేదు.

రైళ్ల రాకపోకల్లో జాప్యం
సెలూన్‌ కోచ్‌లను ప్రధాన రైళ్లకు  అటాచ్‌ చేయడంతో పాటు డిటాచ్‌ చేసే సమయంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటుంది. అలాగే  సెలూన్‌ల కోసం  కేటాయించిన ప్లాట్‌ఫామ్‌లపైన  రైళ్లను నిలిపేందుకు అవకాశం ఉండదు. దీంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. సెలూన్‌తో బయలుదేరే రైళ్లు  అరగంట నుంచి ముప్పావు గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వారానికి రెండు, మూడు సెలూన్‌లు కనిపిస్తాయి. ఆ సెలూన్‌ల అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌ సేవలతో పాటు సదరు అధికారి వెళ్లిపోయే వరకు మొత్తం యంత్రాంగమంతా ఆయన సేవలోనే నిమగ్నమైపోతుంది. దీంతో  సాధారణ రైళ్ల నిర్వహణ లో జాప్యం జరుగుతుంది’ అని ఒక సీనియర్‌ లొకోపైలెట్‌  ఆందోళన  వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు