YouTuber: ముంబై వీధుల్లో కొరియా యూట్యూబర్‌కు వేధింపులు.. లైవ్‌ వీడియో వైరల్..

1 Dec, 2022 11:19 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముంబై నగర వీధుల్లో దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్‌ను వేధించాడు ఓ ఆకతాయి. ఆమె లైవ్ వీడియో చేస్తున్న సమయంలో వచ్చి ఇబ్బందిపెట్టాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ యువకుడి చేష్టలకు ఆ యూట్యూబర్‌ భయాందోళన చెందింది. వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయినా ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె వెనకాలే వెళ్లి మరోసారి వేధించారు.

ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆదిత్య అనే ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దక్షిణ కొరియా యూట్యూబర్‌ను వేధించిన ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దని పేర్కొన్నాడు. 1000 మంది ముందు ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. ముంబై పోలీసులను ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు.

ముంబై పోలీసులు దీనిపై స్పందించారు. యూట్యూబర్ తన వివరాలు చెబితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. అనంతరం కొన్ని గంటలకే వీడియోలోని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

వేరే దేశం నుంచి వచ్చిన మహిళను వేధించిన యువకునిపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మన అతిథులతో ఇలాగేనా ప్రవర్తించేది? అని కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: గుజరాత్ తొలి విడత పోలింగ్‌.. ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా

మరిన్ని వార్తలు