ముంబై నడిరోడ్డులో లైంగిక వేధింపులు.. ఆ యూట్యూబర్‌ ఎలా తప్పించుకుందంటే..

1 Dec, 2022 18:28 IST|Sakshi

క్రైమ్‌: దేశ వాణిజ్య నగరంలో విదేశీ యువతికి ఎదురైన చేదు అనుభవ ఘటనను ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు టీనేజర్లు ఆమెను లైంగికంగా వేధించే యత్నం చేశారు. ఘటన సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. 

దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌ను ముంబై ఖర్‌ వీధుల్లో ఇద్దరు టీనేజర్లు వేధించిన సంగతి తెలిసిందే. అరుస్తూ ఆమె వెంట పడుతూ.. లైంగికంగా వేధించే యత్నం చేశారు. అయితే ఆమె మాత్రం చాకచక్యంగా వ్యవహరించి వాళ్ల నుంచి తప్పించుకుంది. ఈ కేసులో నిందితులిద్దరూ మోబీన్‌ చాంద్‌(19), మొహమ్మద్‌ నఖ్వీబ్‌ అన్సారీ(20)లను అరెస్ట్‌ చేశారు. ఇక..  

ఈ ఘటనలో బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించుకోకుండానే.. మహిళా కానిస్టేబుల్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు ఖర్‌ పోలీసులు. ఈ క్రమంలో ఆ భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకుంది ఆ కొరియన్‌ వ్లోగర్‌. మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. ఇద్దరిలో ఒకతను ఐ లవ్యూ అంటూ నన్ను చూసి అరిచాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆపై నా నడుం పట్టుకుని లాగాడు.  

నన్ను బలవంతంగా చెయ్యి పట్టుకుని వాళ్ల టూవీలర్‌పై కూర్చోబెట్టుకునే యత్నం చేశారు. నేను వద్దని చెప్పా. ఆపై అతను నా మెడ చుట్టూ చేతులేసి.. బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. అది చూసి నేను నిర్ఘాంతపోయా. అతని విదిలించుకునేందుకు యత్నించా. కానీ, అతను నా నడుం పట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్లు నా వెంట పడ్డారు. నా ఫోన్‌ నెంబర్‌ అడిగారు. కానీ, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నెంబర్‌ ఇచ్చా. ఇంతలో నా వ్యూయర్స్‌లో ఒకతను దగ్గర్లోనే ఉండడం.. సమయానికి అతను రావడంతో అతని సాయంతో తప్పించుకోగలిగా అని ఆమె తెలిపింది.

‘‘వాళ్లతో చనువుగా నేను వ్యవహరించానని, అందుకే వాళ్లు అలా ప్రవర్తించానని కొందరు వ్యూయర్స్‌ ఆ టైంలో కామెంట్లు చేశారు. కానీ, చుట్టూ కొంతమంది ఉన్నా నన్ను వాళ్ల నుంచి రక్షించే యత్నం చేయలేకపోయారు కదా. భారత్‌ ఒంటరి మహిళా వ్లోగర్స్‌కు సురక్షితమైన ప్రాంతమని చాలామంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రదేశం సురక్షితం కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరుగుతాయి. నాకు వేరే దేశంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఆ సమయంలో నేను పోలీసులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భారతదేశంలో మాత్రం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నేను 3 వారాలకు పైగా ముంబైలో ఉన్నాను. ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను అని ఆమె ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

మరిన్ని వార్తలు