ముస్లిం కుర్రాళ్లను హెచ్చరించిన ఎస్పీ ఎంపీ

26 Nov, 2020 20:35 IST|Sakshi

లవ్‌ జిహాద్‌ ఆర్డినెన్స్‌ ఓ రాజకీయ స్టంట్‌: ఎస్టీ హసన్‌

లక్నో: ‘లవ్‌ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హిందూ-ముస్లిం యువతీయువకుల మధ్య జరిగే వివాహాల్లో చోటు చేసుకునే మత మార్పిడిలను పరిశీలించడానికి ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్‌ పట్ల ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ‘అయితే ఇక యూపీలో ముస్లిం కుర్రాళ్లు, హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించాలి. కాదని ప్రేమ, పెళ్లి అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఈ ఆర్డినెన్స్‌ కింద అరెస్ట్‌ చేసి టార్చర్‌ చేస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. మొరాదాబాద్ ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్ మాట్లాడుతూ.. ‘లవ్‌ జిహాద్‌ అనే ఓ రాజకీయ స్టంట్‌. మన దేశంలో ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన జీవిత భాగస్వామని ఎన్నుకునే హక్కు ఉంది. హిందువులు, ముస్లింలను.. ముస్లింలు, హిందువులను సంతోషంగా వివాహం చేసుకుంటున్నారు. ఒకసారి ఆ జంటలను పరిశిలిస్తే.. వారు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వారి మధ్య విబేధాలు వస్తే.. అప్పుడు అందరు వరుడు ముస్లిం.. అందుకే ఇలా బాధిస్తున్నారు అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం ప్రారంభిస్తారు’ అన్నారు. (లవ్‌ జిహాద్‌ : కోర్టు సంచలన తీర్పు)

హసన్‌ మాట్లాడుతూ.. ‘ఈ నేపథ్యంలో ముస్లిం యువకులకు నేను చెప్పేది ఒక్కటే. హిందూ యువతులను మీ అక్కాచెల్లెళ్లుగా భావించండి. లేదంటే ప్రభుత్వం మిమ్మల్ని టార్చర్‌ చేస్తుంది’ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ కావాలనే హిందూ-ముస్లింల మధ్య దూరాన్ని పెంచాలని చూస్తుంది అంటూ హసన్‌ మండి పడ్డారు. ఇక యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆమోదించిన లవ్‌ జిహాద్‌ ఆర్డినెన్స్‌ పట్ల కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యోగి ప్రభుత్వం లవ్‌ జిహాద్‌ మీద కాక నిరుద్యోగం, పేదరికం వంటి అంశాల మీద దృష్టి పెడితే మంచిది అంటూ మండిపడుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు