Lok Sabha: నలుగురు లోక్‌సభ ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేసిన స్పీకర్‌

1 Aug, 2022 15:04 IST|Sakshi

న్యూఢిల్లీ:  విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల‍్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేశారు. తాజాగా నలుగురు లోక్‌సభ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు స్పీకర్‌ ఓం బిర్లా. మరోవైపు.. విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదలపై చర్చ చేపట్టారు.

సభలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సోమవారం ఉదయం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు స్పీకర్‌ ఓం బిర్లా. సభలో చర్చలు జరగాల్సిన సమయంలో ఆటంకాలు కలిగించటం దేశానికి నష్టం కలుగుతోందన్నారు స్పీకర్‌. సభామర్యాదను అంతా కలిసి కాపాడాలని పిలుపునిచ్చారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దన్నారు. ఈ క్రమంలోనే నలుగురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రతిపాదనను సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. దానిని ఆమోదించింది లోక్‌సభ. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ ఎంపీ మానికమ్‌ ఠాగూర్‌, జోతిమని, రమ్యా హరిదాస్‌, టీఎన్‌ ప్రతాపన్‌లు ఉన్నారు. ధరల పెరుగుదలపై ప్లకార్డులు పట్టుకుని నిరనసలు చేసిన క్రమంలో ఈ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేశారు.

ఇదీ చదవండి: Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ కాదా? అమిత్‌ షా క్లారిటీ

మరిన్ని వార్తలు