సచిన్‌వాజే కేసులో వెలుగులోకి కొత్త కొత్త అంశాలు

4 Apr, 2021 14:44 IST|Sakshi

ముంబై: అంబానీ ఇంటిముందు పేలుడు పదార్ధాల కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్‌వాజే విషయంలో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసిన ఐదు రోజుల అనంతరం ఆయన జాయింట్‌ అకౌంట్‌ నుంచి రూ.26.50 లక్షలు విత్‌డ్రా అయినట్లు ఎన్‌ఐఏ కోర్టుకు వెల్లడించింది. జాయింట్‌ అకౌంట్‌లో వాజేతో పాటు మరో వ్యక్తి ఉన్నారని, వీరికి సంబంధించిన జాయింట్‌ లాకర్‌ నుంచి నేరపూర్వక సామగ్రిని సైతం ఎవరో బయటకు తీసుకువెళ్లారని ఎన్‌ఐఏ తెలిపింది. కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, వీటిని అధ్యయనం చేసేందుకు సమయం కావాలని ఎన్‌ఐఏ కోరడంతో వాజే కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించింది. హిరేన్‌ మృతదేహం కనుగొనే ముందు రోజు వాజే ఆ ప్రాంతంలో కనిపించారని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.

అలాగే ముంబైలో ఒక బార్‌ నుంచి వాజేకు పెద్ద మొత్తంలో నగదు అందిందంటూ పేర్కొన్న ఒక డైరీని కూడా స్వాదీనం చేసుకున్నట్లు తెలిపింది. వాజే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి పాస్‌పోర్ట్‌ ఒకటి లభ్యమైందని, అతనెవరో గుర్తించే వరకు వాజే కస్టడి పొడిగించాలని కోరింది. అయితే ఎన్‌ఐఏ అభ్యర్ధనను ఆమోదించవద్దంటూ వాజే లాయర్‌ కోర్టును కోరారు. వాజేను ఉపా కింద కస్టడీలో ఉంచేందుకు ఎన్‌ఐఏ ఒక్క సరైన కారణం చూపలేదన్నారు. జాయింట్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌ ఫామ్‌ను చూపాలని ఆయన డిమాండ్‌ చేయగా, ఎన్‌ఐఏ నిరాకరించింది. ఎన్‌ఐఏ కావాలనే కొన్ని పరికరాలను నదిలో వేసి తన క్లయింట్‌పై ఆరోపణలు చేస్తోందని న్యాయవాది వాదించారు. మరోవైపు తనకు గుండె నొప్పి ఉందని కార్డియాలజిస్టుకు చూపాలని వాజే కోర్టును కోరారు. కానీ ఆయన గుండె మాములుగానే పనిచేస్తోందని తమ డయాగ్నోసిస్‌లో తేలినట్లు ఎన్‌ఐఏ తెలిపింద. వాదనలు విన్న కోర్టు వాజే కస్టడీని 7వరకు పొడిగించింది.

చదవండి:

మావోయిస్టుల కాల్పులు: దద్దరిల్లిన దండకారణ్యం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు