రివైండ్‌ 2020: బ్రాండ్‌ మోదీ

29 Dec, 2020 04:11 IST|Sakshi

ఇది కోవిడ్‌ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్‌ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్‌ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది.

చెక్కు చెదరని మోదీ ఇమేజ్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా  నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్‌ఎస్‌–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని  చిక్కుల్లో పడేశాయి.

ఎన్నికల్లో..

ఢిల్లీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కి క్రేజ్‌ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్‌ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ గట్టి పోటీయే ఇచ్చింది.

75 స్థానాలను గెలుచుకొని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్‌ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది.

కాంగ్రెస్‌ ఒక భస్మాసుర హస్తం
కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్‌ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్‌ బిహార్‌ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్‌ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి.

ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్‌ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్‌ ముక్త భారత్‌ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్‌ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి.

పొలిటికల్‌ బాషా
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్‌ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్‌ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్‌  తాను చెప్పినట్టుగానే డిసెంబర్‌ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఒరిగిన రాజకీయ శిఖరాలు

ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్స్‌. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్‌ ముఖర్జీ, అహ్మద్‌ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా  పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్‌ 1న ప్రణబ్‌ మరణించారు.  కాంగ్రెస్‌లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ నవంబర్‌ 23న  కన్ను మూశారు.  

నమస్తే ట్రంప్‌
భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య  300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది.

మరిన్ని వార్తలు