Iconic Budgets In History: ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్‌..

2 Feb, 2022 17:50 IST|Sakshi

స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్‌ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా?

బ్లాక్‌ బడ్జెట్‌
197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్‌రావు చవాన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్‌ బడ్జెట్‌’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట.

క్యారట్‌ – స్టిక్‌
ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్‌ ఆర్థిక మంత్రి వీపీ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌నే ‘క్యారట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు.

ప్రగతి బడ్జెట్‌
ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్‌. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. 

కలల బడ్జెట్‌
వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్‌. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్‌ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు.

‘మిలీనియం’
ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్‌’. అందులో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. 

‘రోల్‌బ్యాక్‌’
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్‌లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్‌ను ‘రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌’గా పిలుస్తుంటారు.
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు