మరో వేవ్‌ ముప్పు తప్పాలంటే ఇలా చేయాల్సిందే..

21 Jun, 2021 00:24 IST|Sakshi

మౌలిక సదుపాయాలు పెంచుకోవాలి 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలి  

ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన  

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మరో వేవ్‌ విరుచుకుపడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలని ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని, వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని పేర్కొంది. మాల్దీవులు, మయన్మార్‌లో ప్రమాదకరమైన కరోనా వేరియంట్లు విస్తరిస్తున్నాయని తెలియజేసింది.

బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లోనూ ఇలాంటి వేరింయంట్లు బెంబేలెత్తించాయని గుర్తుచేసింది. దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు, నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, ఆంక్షలను సడలించాయని, జనం కూడా జాగ్రత్తలు మర్చిపోయారని, ఇలాంటి కారణాల వల్లే ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయని డబ్ల్యూ హెచ్‌వో స్పష్టం చేసింది.  

జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి  
టెస్టు, ట్రేస్, ఐసోలేట్‌ విషయంలో మన ప్రయత్నాలను నిరంతరం కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సామాజిక దూరం, చేతులు శుభ్రపర్చుకోవడం, మాస్కులు సక్రమంగా ధరించడం వంటి జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలంది. ప్రమాదకర  కరోనా వేరియంట్ల ఉనికి ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా రీజినల్‌ డైరెక్టర్‌ పూనమ్‌ క్షేత్రపాల్‌ సింగ్‌ చెప్పారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కరోనా నియంత్రణ చర్యలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. ఆగ్నేయ ఆసియాలో, భారత్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. పాజిటివ్‌ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోందన్నారు. మహమ్మారి ఇంకా మన చుట్టుపక్కలే ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. వైరస్‌ను జయించామన్న అతివిశ్వాసం పనికిరాదన్నారు.     

>
మరిన్ని వార్తలు