టోల్‌ప్లాజా వద్ద హైస్పీడ్‌లో కారు బీభత్సం.. ఒక్కసారిగా గాల్లోకి లేచి..

14 Oct, 2023 18:07 IST|Sakshi

లక్నో: అతి వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలను పాటించనందకు జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు అజాగ్రత్తతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 20ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో-సుల్తాన్‌పూర్ హైవేపై హైదర్‌గఢ్ టోల్ ప్లాజా వద్దకు ఓ కారు హైస్పీడ్‌లో వచ్చింది. ఆదర్శ్‌(20) అధిక వేగంతో కారు నడుపుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కారు అతివేగంలో ఉండటంతో టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు ఒక్కసారిగా గాల్లోకి లేచింది.. ప్రమాదం ధాటికి కారు పార్ట్స్‌ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. 

ఇక, ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన ఆదర్శ్‌ను అక్కడి టోల్‌ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆదర్శ్‌ను పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ సందర్బంగా టోల్‌ సిబ్బంది మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి మంటలు వచ్చాయన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్టు తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని వార్తలు