విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌

14 Aug, 2022 06:25 IST|Sakshi

చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు.

మరిన్ని వార్తలు