స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్‌ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం

6 Jul, 2022 14:02 IST|Sakshi

కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్‌ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్‌ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది.

స్పైస్‌జెట్‌ బోయింగ్‌ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్‌ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్‌ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్‌ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు

కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అ‍త్యవసరంగా ల్యాండ్‌ చేశారు. స్పైస్‌జెట్‌ విమానంలో ఇండికేటర్‌ లైట్‌ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక  గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్‌ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్‌ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

మరిన్ని వార్తలు