Spicejet: గాల్లోనే భారీగా కుదిపేసిన విమానం.. లగేజీ పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు

2 May, 2022 08:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి గాల్లో ఉండగా భారీ కుదుపునకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.  బోయింగ్‌ బీ-373 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ ఫ్లైట్‌ ఎస్‌జీ-945 ముంబై నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఏడున్నర గంటలకు అది అండల్‌లోని కాజి నజ్రుల్‌ ఇస్లాం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

అయితే కాసేపట్లో గమ్యానికి చేరుతుందనగా.. గాల్లో ఉండగానే అది తీవ్రంగా కుదుపున లోనైంది. దీంతో లగేజీ మీద పడడంతో పలువురు ప్రయాణికులకు(40 మంది దాకా అని కొన్ని కథనాలు.. 17 మంది మరికొన్ని కథనాలు చెప్తున్నాయి ) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అయితే.. 

ప్రమాదం జరిగినప్పటికీ ఫ్లైట్‌ దుర్గాపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్యాసింజర్‌లకు చికిత్స అందించారు. వీళ్లలో కొందరిని డిశ్చార్జి చేయగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రిలోనే  ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పేమీ లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. బలమైన గాలుల వల్లే కుదుపునకు విమానం లోనైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు