Delhi Airport Video: స్పైస్‌జెట్‌ నిర్లక్ష్యం.. బస్సు లేక విమానం వద్దే ప్రయాణికుల నిరీక్షణ!

7 Aug, 2022 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన‍్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్‌జెట్‌ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్‌కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్‌ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. 

ఈ విషయంపై స్పైస్‌జెట్‌ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్‌కు చేర‍్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్‌ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్‌ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్‌జెట్‌.

ఇదీ చదవండి: ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన

మరిన్ని వార్తలు