ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం

28 Mar, 2022 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానం(ఎస్‌జీ 160) సోమవారం ఉదయం టేకాఫ్‌ అయ్యే సమయంలో కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్‌ టెర్మినల్‌ నుంచి టేకాఫ్‌ కోసం రన్‌వేపైకి విమానం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

విమానం వెనక్కి తీస్తుండగా కరెంట్‌ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో విమానం కుడివైపు రెక్క(రైట్‌ వింగ్‌) దెబ్బతింది. అలాగే కరెంట్‌ స్తంభం కూడా డ్యామేజ్‌ అయ్యింది. 

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురికావడంతో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను జమ్మూకు పంపించారు. మరోవైపు విమానం కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు  తెలిపారు.

మరిన్ని వార్తలు