హిజాబ్‌ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం

13 Oct, 2022 10:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో..  సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర‍్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్‌ గుప్తా తెలిపారు.

సుమారు పదిరోజులపాటు హిజాబ్‌ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్‌ హేమంత్‌ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్‌ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా..  మరో బెంచ్‌ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్‌, పాఠశాలల్లో హిజాబ్‌ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్‌ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్‌ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం.

ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు