ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత 

29 Nov, 2020 07:35 IST|Sakshi

ముందస్తు విడుదల మళ్లీ విఫలంతో శశికళలో ఆధ్యాత్మికత 

సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది.   చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..)

ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... 
కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు.   (శశికళ ఆశలు అడియాశలు..!)

నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి  2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్‌ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌  అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్‌ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది.    చదవండి:  (పవన్‌ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు)

దైవ పూజల్లో నిమగ్నం.. 
ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్‌ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు