‍చైనా కవ‍్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు

22 Sep, 2023 15:52 IST|Sakshi

ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు.

అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు..
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయలుదేరింది.

భారత్ మండిపాటు..
ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది.

అరుణాచల్ మాదే..
ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది.

భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు.

ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?

మరిన్ని వార్తలు