స్టీరింగ్‌ పట్టి‘నన్‌’..

23 Nov, 2020 20:54 IST|Sakshi
సిస్టర్‌ ఫించిత (పైల్‌)

హెడ్‌ మిస్ట్రెస్‌ + హెవీ వెహికల్‌ డ్రైవర్‌

సిస్టర్‌ ఫించిత డబుల్‌ రోల్‌

కొచ్చి: నన్‌లు సైతం ఏ పనైనా చేయగలరని నిరూపిస్తున్నారు కేరళకు చెందిన సిస్టర్‌ ఫించిత(53). ఇరవయ్యేళ్ల క్రితమే (2000లో) ఫించిత భారీ వాహనాలు నడిపే హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (హెచ్‌డిఎల్‌) పొందారు. ఫ్రాన్సిసన్‌ క్లారిస్టు క్రైస్తవ సమాజంలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి నన్‌గా నిలిచారు. కలాడీ పట్టణం, మణికమంగళంలోని సెయింట్‌ క్లేర్‌ ఓరల్‌ స్కూల్‌ అనే బధిరుల (వినికిడి లోపమున్నవారి) పాఠశాలలో 1994 నుంచి ప్రధానోపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ డుమ్మా కొట్టినప్పుడల్లా తానే డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంటానని ఆవిడ ఉత్సాహంగా తెలిపారు. విద్యార్థుల్ని విహారయాత్రలకు తీసుకువెళ్లినప్పుడు డ్రైవర్‌, తానూ షిఫ్టులు వేసుకుని బస్సుని నడిపేవారమని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల స్కూలు మూసి ఉన్నా బస్సును కండిషన్‌లో ఉంచేందుకు స్కూల్‌ గ్రౌండులో రోజూ కాసేపు నడుపుతున్నారు.

1999లో ఒకసారి పిల్లల్ని విహారయాత్రకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో బస్సుని నడుపుతావా అని తనని మదర్‌ సుపీరియర్‌ అడిగార​న్నారు. అందుకు తాను ప్రయత్నించి చూస్తాను, కానీ హెచ్‌డిఎల్‌ లేదని చెప్పగా దానికోసం ప్రయత్నించమని ఆవిడ సూంచించార​న్నారు. ఏడాదికల్లా అన్ని టెస్టులు పాసై మొదటి ప్రయత్నంలోనే లైసెన్సు సాధించానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి డ్రైవింగ్‌ తన జీవితంలో  భాగమైందన్నారు. హెచ్‌డీఎల్ రాకముందు కారుతో చిన్న ఆక్సిడెంట్‌ చేశానని తెలిపిన ఫించిత అదృష్టవశాత్తూ ఎవరికీ ఏ హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాని, తాను చేసిన చివరి ఆక్సిడెంట్‌ అదేనని వివరించారు. ఇటీవల తన లైసెన్సు గడువు తీరిపోయందన్నారు. దాన్ని పునరుద్ధరించుకోవడానికి మళ్లీ కొన్ని పరీక్షలు పాసవాలని, అందుకే ప్రాక్టీసు కోసం స్కూలు పరిసరాల్లో బస్సుతో రోజూ కొంతసేపు చక్కర్లు కొడుతున్నానని పేర్కొన్నారు.

చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు

మరిన్ని వార్తలు