Vegetable Prices Hike: శ్రావణమాసం ఎఫెక్ట్‌.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు

3 Aug, 2022 09:58 IST|Sakshi

సాక్షి, ముంబై: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధిక శాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటాయి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. దీంతో శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్‌ పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు.

అదేవిధంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉపవాసాలు, పూజల కారణంగా పండ్లు, ఫలాలకు డిమాండ్‌ పెరిగిపోతుంది. దీంతో కోడి గుడ్లు, మేక, కోడి మాంసం ధరలు పడిపోతాయి. కాని ఏటా శ్రావణ మాసంలో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలు అమాంతం చుక్కలను తాకుతాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఏపీఎంసీలోకి 2,586 టన్నుల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 3,815 టన్నులు వస్తున్నాయి. దీన్ని బట్టి శ్రావణ మాసంలో కూరగాయాలకు ఏ స్ధాయిలో డిమాండ్‌ ఉందో తెలుస్తోంది. 

ఏటా శ్రావణ మాసం ప్రారంభం కాగానే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరుగుతుంది. కాని ఈ ఏడాది జూలైలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లన్నీ కోతకు గురై పాడైపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణ స్తంభించిపోయింది. పండించిన పంటలు కూడా నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రక్కుల్లో ఉన్న సరుకులు కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

వీటికితోడు తరుచూ ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. మరోపక్క ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌ ఎక్కువ, సరుకుల రవాణా తక్కువ అనే పరిస్ధితి నెలకొంది. ఫలితంగా కూరగాయల ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10–20 శాతం పెరగ్గా, రిటైల్‌ వ్యాపారులు 40 శాతం మేర పెంచారు. అలాగే పండ్లు, ఫలాల ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10–15 శాతం పెరగ్గా రిటైల్‌లో 20 శాతం మేర ధరలు పెంచాల్సి వచ్చిందని చిరు వ్యాపారులంటున్నారు.

మరిన్ని వార్తలు