శ్రీలంక సేన వీరంగం.. 40 మంది జాలర్లు బందీ

26 Mar, 2021 08:50 IST|Sakshi

ఎన్నికల వేళ జాలర్లలో ఆక్రోశం

సాక్షి, చెన్నై: కొన్ని నెలల అనంతరం శ్రీలంక సేన మళ్లీ సాగరంలో వీరంగం సృష్టించింది. రామేశ్వరంకారైక్కాల్, పుదుకోట్టైలకు చెందిన 40 మంది జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. ఈ సమాచారం జాలర్ల గ్రామాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది.  తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు సాగించే వీరంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కాలంలో ఈ దాడులు తగ్గాయి. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు మళ్లీ రాష్ట్రానికి చేరారు. అనేక పడవలు సైతం తిరిగి ఇక్కడకు చేరాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో శ్రీలంక సేనలు దాడులు చేసి నట్టు, ఓ పడవ మునగడంతో నలుగురు మరణించడం వెలుగు చూసింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన నలుగురు జాలర్లు మరణించారు. అయితే శ్రీలంక సేనలు తుపాకీలు గురిపెట్టినట్టు, దాడులతో హతమార్చినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణసాగుతోంది.  

బందీగా పట్టుకెళ్లారు.. 
అసెంబ్లీ ఎన్నికల వేళ సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాలు అనేక సురుక్కు ముడి వల(అల్లికల)తో వేటకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకున్నాయి. వీరిని బుజ్జగించేందుకు తీవ్రంగానే ఎన్నికల యంత్రాంగం ప్రయత్నాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సేన జాలర్లపై విరుచుకుపడ్డ సమాచారం. యావత్‌ తమిళ జాలర్లల్లో ఆగ్రహాన్ని రేపింది. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం నుంచి వెళ్లి కచ్చదీవుల్లో చేపల వేటలో ఉన్న జాలర్లపై రెండు బోట్లలో వచ్చిన శ్రీలంక నౌకాదళం వీరగం సృష్టించారు. జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనం కాగా, రెండు పడవల్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ రెండు పడవల్లో ఉన్న 20 మందిని బందీలుగా శ్రీలంకకు పట్టుకు వెళ్లారు.

అలాగే, కారైక్కాల్‌ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో ఐదు పడవల్ని సరిహద్దులు దాటేశారన్న నెపంతో పట్టుకెళ్లారు. ఈ పడవల్లో మరో 20 మంది జాలర్లు ఉన్నారు. 40 మంది జాలర్లను ఒకే రోజు శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం రేగింది. ఎన్నికల వేళ జాలర్లపై శ్రీలంక సేన దాడి చేయడంతో అధికార అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులకు కలవరం తప్పడం లేదు. సముద్ర తీర నియోజకవర్గాల్లో పోటీలో ఈ పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా జాలర్ల గళం విప్పే పనిలో పడడం గమనార్హం.

చదవండి: పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ

మరిన్ని వార్తలు