ఒవైసీ ‘తప్పుడు’ ట్వీట్‌పై శ్రీనగర్‌ పోలీసుల స్ట్రాంగ్‌ కౌంటర్‌

21 Sep, 2022 08:57 IST|Sakshi

శ్రీనగర్‌: ఏఎంఐఎం పార్టీ అధినేత‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి శ్రీనగర్‌ పోలీసులు కౌంటర్‌ ఇచ్చారు. జామియా మసీద్‌ విషయంలో ఒవైసీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. 

సోఫియాన్‌, పుల్వామాలో తాజాగా మల్టీపర్పస్‌ సినిమా హాల్స్‌ను ప్రారంభించారు జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. దీంతో హాల్‌కు వెళ్లి సినిమా చూడాలన్న అక్కడి ప్రజల చిరకాల కల నెరవేరిందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపీ ఒవైసీ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

శ్రీనగర్‌లోని జామియా మసీద్‌ను ప్రతీ శుక్రవారం మూసేస్తున్నారని, కనీసం శుక్రవారం మధ్యాహ్న సమయంలో అయినా తెరవాలంటూ ఎల్జీని ఉద్దేశిస్తూ ఎద్దేవా ట్వీట్‌ చేశారు ఒవైసీ. అయితే దీనికి.. శ్రీనగర్‌ పోలీసులు ట్విటర్‌ ద్వారా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. 

‘‘జామియా పూర్తిగా తెరిచే ఉంటోంది. కరోనా తర్వాత కేవలం మూడు శుక్రవారాల్లో మధ్యాహ్న నమాజ్‌ సమయంలో మాత్రమే, అదీ ఉగ్రదాడి సమాచారం, శాంతిభద్రతల సమస్యలతో మూతపడింది. లోపల జరిగే సంఘటనలకు తమది బాధ్యత కాదని జామియా అధికారులు ప్రకటించిన నేపథ్యంలోనే తాత్కాలికంగా ఆ పూటకు మూసేయాల్సి వచ్చింది’’ అంటూ చివర్లో.. అజ్ఞానానికి సాకు లేదు అని ఒవైసీ ట్వీట్‌కు శ్రీనగర్‌ పోలీసులు ఘాటుగానే బదులు ఇచ్చారు.

ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే!

మరిన్ని వార్తలు