SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం

8 Aug, 2022 06:15 IST|Sakshi

వేరే కక్ష్యలోకి ఉపగ్రహాలు 

మైక్రోశాట్‌–2ఏ, ఆజాదీశాట్‌ నుంచి అందని సంకేతాలు

వచ్చే నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం: ఇస్రో

లోపాలు సరిచేసుకుని విజయం సాధిస్తాం: చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌

సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు.

మైక్రోశాట్‌–2ఏ (ఈఓఎస్‌శాట్‌)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్‌ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్‌స్టేషన్‌కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది.  

తొలి మూడు దశలు విజయవంతం  
ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది.

అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్‌ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు.  

పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్‌   
రాకెట్‌లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్‌–2ఏ, ఆజాదీశాట్‌లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్‌ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందకుండా పోయాయని వివరించారు.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్‌.సోమనాథ్‌ అభినందనలు తెలిపారు. రాకెట్‌ ప్రయోగమంతా సక్సెస్‌ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్‌ కిరణ్‌కుమార్, కె.శివన్‌ తదితరులు విచ్చేసి, ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు.  

ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు  
నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్‌–2ఏ, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు  x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది.

మరిన్ని వార్తలు