ఊహించని పరిణామం.. మంత్రిని సన్మానిస్తుండగా కూలిన స్టేజ్‌

5 Jan, 2024 20:05 IST|Sakshi

రాజస్థాన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోటాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిగా  నియమితులైన బీజేపీ నేతను సన్మానిస్తుండగా..స్టేజీ కుప్పకూలింది. దీంతో పలువురు బీజేపీ నాయకులు కిందపడటంతో  గాయాలయ్యాయి. 

వివరాలు..  రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. కేబినెట్‌లోని మంత్రులకు నేడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.  సంగోత్‌ ఎమ్మెల్యే  హీరాలాల్‌ నగర్‌కు సైతం మంత్రి బాధ్యతలు అప్పజెప్పింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం తొలిసారి మంత్రి తన సొంత నియోజక వర్గానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హీరాలాల్‌కు స్వాగతం పలికేందుకు జనం అధికంగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు మంత్రికి పూలమాలలు వేస్తుండగా అకస్మాత్తుగా స్టేజ్‌ కుప్పకూలింది.

ఈ ఘటనలో మంత్రి సహా వైదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ప్రజల్లోనూ, స్థానికంగానూ గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామపెద్ద సహా ఐదుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి హీరాలాల్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయన  ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే స్టేజ్‌ను 15 మంది ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేయగా.. 40 మంది ఒకేసారి నిల్చోడంతో బరువు ఎక్కువై కూలినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు