స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్

5 Oct, 2020 11:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ  కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు.  దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా  ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  కాగా  గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో,  ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య  66,23,815కు చేరింది. మరణించిన వారి  సంఖ్య 1,02,695 గా ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు