స్కూళ్లు తెరవడంపై నిర్ణయం రాష్ట్రాలదే: కేంద్ర ఆరోగ్య శాఖ

28 Jul, 2021 19:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూత పడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్లను తెరవాలా వద్దా అనే అంశంపై అన్ని వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. దేశంలో థర్డ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణల హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లు తెరవాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

చాలా మంది ఉపాధ్యాయులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్నారని..టీకాలు వేగవంతం చేయడం  పూర్తిగా  రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం ఉపాధ్యాయులు కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది  జనాభాలో కేవలం 9.54 కోట్ల మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూళ్ల టీచర్ల టీకా శాతం, ప్రస్తుత పరిస్థితిపై సీబీఎస్‌ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది.

మరిన్ని వార్తలు