సమష్టి కృషితోనే నేరాలకు అడ్డుకట్ట

28 Oct, 2022 05:27 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఆవశ్యకం

రాష్ట్రాల హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో షా

సూరజ్‌కుండ్‌(హరియాణా): దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ‘చింతన్‌ శిబిర్‌’ సదస్సులో అమిత్‌ షా ప్రసంగించారు.

‘ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్రభారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్‌ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందాం. జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్‌ సఫలత సాధించింది. ‘పశుపతి(నాథ్‌) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేది.

అదీ సద్దుమణిగింది. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రత అనేది ఆ రాష్ట్ర అంశమే. కానీ, మనందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దాం. ఇది మనందరి సమష్టి బాధ్యత’ అని హోం మంత్రులతో షా వ్యాఖ్యానించారు. ‘కొన్ని ఎన్‌జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయి. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయి. వీటిపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆంక్షల చర్యలు తీసుకున్నాం’ అని షా చెప్పారు.

మరిన్ని వార్తలు