ఐక్యతా విగ్రహాన్ని ఎంతమంది సందర్శించారో తెలుసా?

16 Mar, 2021 11:14 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ‘స్టాచ్యూఆఫ్‌ యూనిటీ’ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు, 50 లక్షల మందికి పైగా సందర్శకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినట్టు రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, అన్ని వయస్సుల జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని గుజరాత్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌గుప్తా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. కెవాడియాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యాం వద్ద, ప్రపంచంలోనే అతిపెద్దదైన, 182 అడుగుల సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని 2018, అక్టోబర్‌ 31 న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి అదనపు హంగులు జోడించారు. ఈ ప్రాంతానికి రైలు, విమానాల రాకపోకలను మెరుగుపర్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది కొత్త రైళ్ళను, అహ్మదాబాద్‌ నుంచి సీప్లేన్‌ సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులపై కోవిడ్‌ ప్రభావం పడింది. కోవిడ్‌ ఆంక్షల కారణంగా ఏడు నెలల సుదీర్ఘ కాలం అనంతరం గతయేడాది అక్టోబర్‌ 17న తిరిగి సందర్శకులకు అనుమతించారు.

ఈ యేడాది జనవరి 18న దేశంలోని పలు ప్రాంతాల నుంచి 8 రైళ్ళను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని ఎక్కువ మంది సందర్శించారని ప్రకటించారు. ప్రస్తుతం పెరిగిన రవాణా సౌకర్యాల కారణంగా ఒక సర్వే ప్రకారం రోజుకి లక్ష మంది పర్యాటకులు కెవాడియాను సందర్శించొచ్చన్నారు. 
చదవండి: సోనియాపై కేసును మూసేయాలి

మరిన్ని వార్తలు