Free Chhole Bhature: బూస్టర్‌ డోస్‌పై స్ట్రీట్‌ వెండర్‌ అవగాహన.. ‘ఫ్రీ ఫుడ్‌’ ఆఫర్‌!

1 Aug, 2022 15:42 IST|Sakshi

చండీగఢ్‌: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్‌కు చెందిన స్ట్రీట్‌ వెండర్‌ ఉచితంగా ఛోల్‌ భతుర్‌(సెనగ మసాల పూరీ) టిఫిన్‌ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. 

ఉత్తర భారతంలో చోల్‌ భతురే చాలా ఫేమస్‌. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్‌ ఫుడ్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్‌లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్‌. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్‌ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్‌. ఈ విషయాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్‌ రాణాపై ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే

మరిన్ని వార్తలు