వందే భారత్‌పై రాళ్ల దాడులు ఆగవా?.. తాజాగా కేరళలో సేమ్‌ సీన్‌

2 May, 2023 10:08 IST|Sakshi

తిరువనంతపురం: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన అల్లరి మూకలు.. ఈ మధ్య ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చర్యలు ఉంటాయని, జైలు శిక్ష తప్పదనే రైల్వే శాఖ హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి మరీ రైలుపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా పేరున్న వందే భారత్‌ రైళ్లపై దాడులపరంపరకు చెక్‌ పెట్టడం ఎలాగనే ఆలోచనలో పడిపోయింది రైల్వే శాఖ.  

తాజాగా.. కేరళలో కొత్తగా ప్రారంభమైన వందే భారత్‌పైనా రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్‌ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి.. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ మధ్య కేరళ తొలి వందేభారత్‌ను ప్రారంభించారు.  అయితే.. తాజాగా తిరునవయా-తిరూర్‌ మధ్య వందే భారత్‌పై రాళ్లు రువ్వారు ఆగంతకులు. ఈ దాడిలో అద్దం పగిలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. వందేభారత్‌ రైళ్లపై గత కొంతకాలంగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు సికింద్రాబాద్‌-విశాఖపట్నం రూట్‌లో స్వల్ప కాలవ్యవధిలోనే వందేభారత్‌పై మూడుసార్లు రాళ్ల దాడి జరిగింది. అంతకు ముందు మార్చిలో పశ్చిమ బెంగాల్‌  ఫన్సిదేవా వద్ద, అదే నెలలో హౌరా-న్యూ జల్పైగురి మధ్య మాల్దా సమీపంలో వందేభారత్‌ రైళ్ల పై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తంగా దేశంలో వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత.. ఇలాంటి దాడుల కేసులే పాతిక దాకా నమోదు అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో రైల్వే శాఖ సీఆర్‌పీఎఫ్‌ ద్వారా ఈ తరహా నేరాల కట్టడికి సమాలోచనలు చేస్తోంది.

ఇదీ చదవండి: కవితక్క ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు 

మరిన్ని వార్తలు