మరో ‘నిర్భయ’ కాదు.. ఉత్తుత్తి డ్రామా!! కావాలనే కట్టుకథ అల్లిందా?

21 Oct, 2022 07:18 IST|Sakshi

మరో నిర్భయ ఉదంతంగా.. సంచలనం సృష్టించిన ఘజియాబాద్ గ్యాంగ్‌ రేప్‌ కేసు ఉత్తదేనని పోలీసులు తేల్చారు. ఢిల్లీ ఉమెన్స్‌ కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ ట్వీట్‌తో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే..  36 ఏళ్ల సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే  సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు పోలీసులు ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్-ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఉదంతం.. దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళను అపహరించిన ఐదుగురు.. అత్యాచారం చేసి శారీరకంగా హింసించారనే ఉదంతం ప్రకంపనలు పుట్టించింది. కాళ్లు చేతులు కట్టేసి.. జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ-ఘజియాబాద్‌ రూట్‌లోని ఆశ్రమ్‌ రోడ్డు దగ్గర పడేశారని, నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు కూడా. అయితే.. 


పోలీసుల అదుపులో నిందితులు

అయితే ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో.. ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఈలోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. 


బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి.. నాటకం ఆడిందని చెప్తున్న పోలీసులు

చివరికి ఆమె మొబైల్‌ సిగ్నల్‌ను ట్రేస్‌ చేసి.. అసలు విషయాన్ని తేల్చేశారు పోలీసులు. స్నేహితురాలి బర్త్‌ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆమె ఫిర్యాదు. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్‌లో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు.  

ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్‌ పోలీస్‌ చీఫ్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో గడిపిందట. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే గ్యాంగ్‌ రేప్‌ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు.  పోలీసుల ప్రకటనపై బాధితురాలి నుంచిగానీ.. మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ నుంచిగానీ ఎటువంటి స్పందన రాలేదింకా.

ఇదీ చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డ జంట 

మరిన్ని వార్తలు