-

వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు

2 Oct, 2021 15:31 IST|Sakshi

పట్న: మన దగ్గర అప్పుడప్పుడు వింత వింత పుకార్లు వ్యాప్తి అవుతుంటాయి. ఆడపడుచులకు గాజులు పెట్టించాలి.. ఒక్కడే మగ పిల్లాడు ఉన్న తల్లి వేప చెట్టుకు నీళ్లు పోయాలని.. ఇలా వింత వింత పుకార్లు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలా వెలుగులోకి వచ్చిన ఓ పుకారు వల్ల పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. పుకారు వల్ల బిస్కెట్ల అమ్మకాలు ఎలా పెరిగాయా అని ఆలోచిస్తున్నారు. అదే తెలియాలంటే ఈ వార్త చదవాలి. 

తాజాగా బిహార్‌లో ఓ వింత పుకారు వెలుగులోకి వచ్చింది. దాని సారంశం ఏంటంటే.. జితియా పండగ నాడు మగపిల్లలు పార్లేజీ బిస్కెట్లు తప్పక తినాలి. లేదంటే వారికి భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అని పుకారు మొదలయ్యింది. దాంతో జనాలు ఎగబడి మరీ పార్లే బిస్కెట్లు కొన్నారు. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. కంపెనీకి మాత్రం అమ్మకాలు పెరిగి లాభాలు వచ్చాయి. 
(చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం)

తొలుత ఈ పుకారు సీతామర్హి జిల్లాలో వినిపించింది. దాంతో జనాలు పార్లే జీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరుగులు తీశారు. ఈ పుకారును జనాలు ఎంత బలంగా నమ్మారు అంటే.. సీతామర్హి ప్రాంతంలోని పలు దుకాణాల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. లైన్లలో ఉన్నవారంతా బిస్కెట్ల కోసం వచ్చినవారే కావడం గమనార్హం. జనాలు బిస్కెట్ల కోసం ఇలా ఎగబడటంతో చాలా షాపుల్లో అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. 

నెమ్మదిగా ఈ పుకారు కాస్త బైర్గానియా, ధేంగ్‌, నాన్‌పూర్‌, దుమ్రా, బజ్‌పట్టి ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకేముంది దీన్ని గుడ్డిగా నమ్మిన జనాలు.. పార్లేజీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరిగెత్తారు. ఆ తర్వాత ఈ పుకారు మరో నాలుగు జిల్లాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎందుకు ఇలా బిస్కెట్ల కొంటున్నారని జనాలను అడిగితే.. ‘‘జితియా పండగనాడు మగ పిల్లలు పార్లే బిస్కెట్లు తినకపోతే.. వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కొంటున్నాం’’ అని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు షాపు యజమానులు ఐదు రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్‌ని 50 రూపాయలకు అమ్మడం ప్రారంభించారు. అసలు ఈ పుకారు ఎలా.. ఎవరు వ్యాప్తి చేశారు అనే దాని గురించి మాత్రం తెలయలేదు. 
(చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు !)

జితియా పండుగ..
బిహార్‌, జార్ఖండ్‌, ఉ‍త్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జితియా పండుగ జరుపుకుంటారు. తల్లులు.. తమ కుమారులు జీవితాంతం సంతోషంగా.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 24 గంటల పాటు ఉపవాసం చేస్తారు.

చదవండి: అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’

మరిన్ని వార్తలు