వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు

27 Jan, 2021 13:01 IST|Sakshi

శునకం మృతితో విషాదంలో కాలనీవాసులు

తిరువనంతపురం: మానవుడికి జంతువులకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. విశ్వాసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న శునకానికి ఆదరణ మిగతావాటికన్నా ఎక్కువే. చాలా మంది వాటిని పేరు పెట్టి పిలుస్తూ సాకుతారు. వాటికి క్యూట్‌ క్యూట్‌ పేర్లు పెట్టి ముద్దాడుతుంటారు. అలాంటి ఓ కుక్క ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కేరళలో ఓ వీధి వీదంతా విషాదంలో మునిగింది. ఆ వీధిలోని వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుక్క పేరుతో కాలనీలో పోస్టర్లు వేసి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈ విశేష ఘటన కేరళలోని పథానంతిట్ట జిల్లా మనక్కాల పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజ్‌ జంక్షన్‌ ప్రాంతంలో ఒక పంచాయతీ వారు ఒక కుక్కను వదిలివెళ్లారు. 

దీంతో స్థానికులు ఆ కుక్కకు తిండిపెట్టి ఆదరించారు. దానికి రేమణి అని పేరు కూడా పెట్టారు. కాలనీవాసులు ఆహారం అందిస్తుండడంతో రేమణి కాలనీకి, దుకాణాలకు కాపలాగా నిలవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఆ ప్రాంతంలోకి అపరిచితులు వెళ్లాలంటే హడలిపోయేవారు. కాలనీవాసులు ఎవరైనా రాత్రిళ్లు ఆలస్యంగా వస్తే వారికి తోడుగా రేమణి వచ్చేదని టైర్ల వ్యాపారం నిర్వహించే ప్రదీప్‌ తెలిపారు. అయితే గతవారం వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య రేమణి పరుగెత్తడంతో ప్రమాదానికి గురై మృతి చెందింది. రేమణి మృతితో ఆ కాలనీ షాక్‌కు గురైంది. ముఖ్యంగా దుకాణదారులు, వ్యాపారులు రేమణి మృతిని తట్టుకోలేకపోయారు. తమ వ్యాపారాలకు రక్షణగా నిలిచిన రేమణిని గుర్తు చేసుకుంటున్నారు. వియ్‌ లవ్‌ యూ.. మిస్‌ యూ.. రిప్‌ టు రేమణి అంటూ సోషల్‌ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు