న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి

27 Aug, 2022 06:19 IST|Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపు  

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్‌లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు.

బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్‌కట్‌ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు.  

న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే..
గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్‌ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు.

న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను భీష్మ పితామహుడిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ వికాస్‌ సింగ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా  సీజేఐ (నియమిత ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్‌ ఎన్‌వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు.  

పెండింగ్‌ కేసులే అతిపెద్ద సవాల్‌
విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్‌ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్‌ లాయర్‌ దుష్యంత్‌ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్‌ రమణ సేవలను సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశంసించారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్‌ రమణను అభినందించారు.   

కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం   
సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను  ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం  ఇదే మొదటిసారి.

నేడు జస్టిస్‌ యు.యు.లలిత్‌ ప్రమాణం  
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు.    
వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్‌

మరిన్ని వార్తలు