రాళ్లు రువ్వి, టైర్లు కాల్చి: కోవిడ్‌ రూల్స్‌పై విద్యార్థుల కన్నెర్ర

5 Apr, 2021 15:18 IST|Sakshi

పాట్నా: విద్యాలయాలను మూసివేస్తున్నారు కానీ బహిరంగ సభలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహణపై ఎలాంటి నిషేధం విధించారు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకో రూల్‌.. మాకో రూలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై మండిపడుతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విద్యార్థులు, పోలీసులకు గాయాలు కాగా, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన బిహార్‌లోని ససారామ్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ససారామ్‌లోని అధికారులు, పోలీసులు విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేయాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా గౌరక్షిణి ప్రాంతంలో ఉన్న కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు పంపించడంతో అవి మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో చదువులు ఆగిపోయాయని మళ్లీ ఇప్పుడు మూసివేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో ససరామ్‌లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు.

కోచింగ్‌ సెంటర్ల మూసివేత ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వెళ్లిపోవాలని విద్యార్థులను ఆదేశించినా వారు వెనుదిరగలేదు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు లేని నిషేధం మాకెందుకు? అని ప్రశ్నించారు. వారి కార్యక్రమాలకు బ్రేక్‌ వేయరు కానీ మా చదువులకు అడ్డంకి సృష‍్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అదనపు బలగాలను రప్పించి విద్యార్థుల ఆందోళనను శాంతపర్చారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏ‍ర్పడ్డాయి. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో 9 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు