‘సార్‌.. ప్లీజ్‌ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’.. టీచర్‌ అంటే ఇలా ఉండాలా?

15 Jul, 2022 14:33 IST|Sakshi

వైరల్‌: గురువులకు గౌరవం ఇచ్చే విద్యార్థులు.. ఈరోజుల్లో చాలా అరుదు. లాక్‌డౌన్‌ టైంలో టీచర్ల పట్ల విద్యార్థుల మానసిక స్థాయి ఏరేంజ్‌లో ఉందో పలు వీడియోల ద్వారా కళ్లారా చూశాం కూడా. కానీ, విద్యార్థులకు తగ్గట్లుగా ఉంటూనే.. వాళ్ల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ గురువు అనుకున్నాడు. మరి అలాంటి ఫేవరెట్‌ గురువును వదులుకునేందుకు ఏ విద్యార్థికి అయినా ఎందుకు మనసు ఒప్పుతుంది?. 

తమకు నాలుగేళ్లపాటు పాఠాలు చెప్పిన శివేంద్ర సింగ్‌ సార్‌ను.. మరో స్కూల్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన కోసం మంగళవారం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి విద్యార్థులు ఆయన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లతో ఆయన్ను హత్తుకుని ‘వెళ్లొద్దు సార్‌..’ అంటూ రోదించారు. యూపీ రాయ్‌గఢ్‌ చందౌలీ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీడ్కోలు సభలో కానుకలు ఇచ్చి, తోటి టీచర్లు ప్రశంసలు గుప్పించారు. సభ అయిపోగానే పిల్లలంతా ఆయన చుట్టూ చేరి కన్నీళ్లు గుప్పించారు. ‘‘త్వరలోనే వస్తా.. బాగా చదువుకోండి.. మీరంతా బాగుండాలి అంటూ వాళ్లను ఓదార్చి..  ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు ఆయన. తోటి పిల్లలతో కలిసి కొండ ప్రాంతంలో క్రికెట్‌ ఆడేవాడినని అనుభవాలను గుర్తు చేసుకున్నాడాయన. 

శివేంద్ర సింగ్‌.. చాలా వైవిధ్యమైన పద్ధతిలో పాఠాలు చెప్తాడు. అందుకే ఆయనంటే పిల్లలకు అంత ఇష్టం. 2018లో ఆయన అసిస్టెంట్‌ టీచర్‌గా ఆ స్కూల్‌కు వెళ్లారు. ఆటలు, సోషల్‌ మీడియా, బొమ్మలు, పాటల ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేవారాయన. కేవలం పాఠాలు మాత్రమే కాదు.. ప్రపంచం గురించి కూడా ఆయన వాళ్లకు వివరించేవాడు. లాక్‌డౌన్‌ టైంలో ఆయన తీసుకున్న చొరవకు ఆ జిల్లాలోనే ప్రముఖ స్థానం దక్కింది. ఆయన ప్రభావంతోనే స్కూల్‌ హాజరు శాతం పెరిగింది కూడా. అందుకే ఆయన సేవలను ఉపయోగించుకోవాలని..  పక్క జిల్లాలోని ఓ స్కూల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసింది యూపీ విద్యాశాఖ.


ఇదీ చదవండి: గురుబ్రహ్మ.. కారడవిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..!

మరిన్ని వార్తలు