రెండు ప్రయత్నాల్లో పూర్తి చేయొచ్చు

29 Mar, 2023 03:57 IST|Sakshi

ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు

ఉక్రెయిన్‌ విద్యార్థులకు ‘సుప్రీం’ శుభవార్త

ఒక ప్రయత్నమన్న కేంద్రం సూచనకు సవరణ

చైనా, ఫిలిప్పీన్స్‌ దేశాలకూ వర్తింపజేసిన సుప్రీంకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ తదితర దేశాల నుంచి భీతావహ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేత పట్టుకొని దేశానికి వచ్చిన ఫైనల్‌ ఇయ­ర్‌ వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు సుప్రీం­కోర్టు ఊపిరిపోసింది. దేశీయంగా ఏ కళాశాలలోనూ చేరకుండానే రెండు ప్రయత్నా­ల్లో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఏడాది కాలంగా ఆందోళన చెందుతున్న విద్యార్థుల సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. 

చైనా, ఫిలిప్పీన్స్‌లో కరోనా ఆంక్షలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయలేకపోయిన వైద్య విద్యార్థుల పిటిషన్లను మంగళవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  విద్యార్థుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకొని నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసిందని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి  ధర్మాసనానికి తెలిపారు.

‘‘ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం, భారతీయ కళాశాలల్లో నమోదు చేసుకోకుండా ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పార్ట్‌–1, పార్ట్‌–2 పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్‌)  ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి అవకాశం ఇస్తాం. అంటే, పార్ట్‌–2 పరీక్ష రాయాలంటే  పార్ట్‌–1 పూర్తి చేసి ఒక ఏడాది పూర్తి కావా­లి. దేశీయంగా ఎంబీబీఎస్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా థియరీ పరీక్షలు, నిర్ణయించిన  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి.

పార్ట్ట్‌–1, పార్ట్‌–2 పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల నిర్బంధ రొటేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాలి. జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయించిన విధంగా చెల్లింపులు ఉంటాయి. ఈ సిఫార్సులు అత్య­­­­వసర చర్యగా భావించాలి.’’ అని ఐశ్వర్య భాటి వివరించారు.  

‘‘ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు.. అందుకే’’ జాతీయ వైద్య కమిషన్, విదేశీ వైద్య విద్య సంస్థలు అనుసరించే సిలబస్‌ వేరుగా ఉంటాయని విద్యార్థుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు గోపాల శంకర్‌నారాయణ్,నాగముత్తులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరీక్ష పూర్తి చేయడానికి ఒక ప్రయత్నంలో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఇదేమీ అఖిల భారత బార్‌ ఎగ్జామినేషన్‌ కాదు.

ఉత్తీర్ణత సాధించకపోతే కనీసం అప్పటికే పూర్తి చేసిన ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు’’ అని గోపాల శంకర్‌నారాయణ్‌ తెలిపారు. నిపుణుల కమిటీ నిర్ణయంలో జోక్యం చేసుకోమని, అయితే ఒకే ప్రయత్నంలో పరీక్ష పూర్తి చేయాలన్న సూచన ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం అభిప్రాయపడింది. రెండు ప్రయత్నాలు అవకాశం ఇవ్వాలన్న సవరణ చేయాలని కమిటీని ఆదేశించింది.

‘‘కమిటీ నివేదికను చిన్న మార్పుతో పరిగణనలోకి తీసుకుంటాం. పార్ట్‌–1, పార్ట్‌–2 (థియరీ, ప్రాక్టికల్‌) పరీక్షలు పూర్తి చేయడానికి రెండు అవకాశాలు ఇవ్వాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మానవతా దృక్పథంతో భారతీయ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలి్పంచాలని సుప్రీంకోర్టును విద్యార్థులు ఆశ్రయించారు. జాతీయ వైద్య కమిషన్‌తో సంప్రదింపులు చేసి దీనికి పరిష్కారం కనుక్కొనే దిశగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.  

మరిన్ని వార్తలు