Blood Thinners: ఇవి 50% వరకు కోవిడ్‌ మరణాలను తగ్గిస్తున్నాయి..

5 Oct, 2021 11:05 IST|Sakshi

తాజా పరిశోధనలో వెల్లడి ఠి లాన్సెట్‌ జర్నల్‌లో వివరాలు ప్రచురితం

న్యూఢిల్లీ: బ్లడ్‌ థిన్నర్లు (రక్తాన్ని పలుచగా చేసే మందులు) కోవిడ్‌ మరణాలను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్‌ ఈ–క్లినికల్‌ మెడిసిస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని 60 ఆస్పత్రుల్లో 2020 మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు, 6,195 మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 90 రోజలు పాటు యాంటీ కోయాగ్యులేషన్‌ థెరపీ ఇచ్చి ఈ వివరాలను సేకరించారు. 
చదవండి: జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ రూ.1,900

ఏం తేలింది ?
రక్తాన్ని పలుచగా చేసే మందుల కారణంగా కోవిడ్‌ మరణాలు తగ్గినట్లు గుర్తించారు. కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డం కట్టి, సంకట స్థితి ఏర్పడుతోంది. బ్లడ్‌ థిన్నర్ల వల్ల ఈ ముప్పు తగ్గుతోంది. కోవిడ్‌ సోకే నాటికే బ్లడ్‌ థిన్నర్లు వాడుతున్న వారిలో కరోనా ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, మరణాలు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. బ్లడ్‌ థిన్నర్లు వాడుతున్న వారిలో 43శాతం మంది ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండానే కోవిడ్‌ను జయించినట్లు పరిశోధన తెలిపింది. మరణాలు కూడా దాదాపు సగం కంటే తక్కవ ఉన్నట్లు తేలింది. గుండె కొట్టుకోవడంలో అసమానతలు ఉండటం, ఊపిరితిత్తులు–కాళ్లలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నవారికి సాధారణంగా వైద్యులు బ్లడ్‌ థిన్నర్లు ఇస్తుంటారు. 
చదవండి: పేగులపై పోస్ట్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ సమస్యలుంటే అప్రమత్తం కావాల్సిందే

అదే కీలకం..
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన ప్రారంభంలో బ్లడ్‌ థిన్నర్లను ఇవ్వడం ద్వారా కరోనా తీవ్రమయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతున్నాయని పరిశోధకురాలు, మిన్సెసొటా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సామెహ్‌ హొజాయెన్‌ తెలిపారు. ప్రపంచంలో చాలా మెడికల్‌ సెంటర్లు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. తమ బృందం ప్రస్తుతం ఈజిప్ట్‌తో పాటు పలు దేశాల్లో ఇదే పరిశోధనను నిర్వహిస్తోందని తెలిపారు. 

మరిన్ని వార్తలు