వ్యాక్సిన్‌: వారికి ఒక్క డోస్‌ ఇస్తే సరిపోతుంది..

14 Jun, 2021 15:44 IST|Sakshi

హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి జరపిన అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకు మరింత విస్తరిస్తున్న మహమ్మారికి తలలు వంచేందుకు ప్రజల ముందు ఉన్న అస్త్రం రెండే. మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించడం. మరొకటి అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవడం. మాస్క్‌, దూరం పాటిస్తున్నప్పటికీ కొంతమంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని భయపడతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఆపోహాలు అన్నీ తొలిగి వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు.

కాగా ఇప్పటి వరకు బారిన ప‌డ‌కుండా ఉండాలంటే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కోవిషిల్డ్‌, కోవాగ్జిన్‌ తీసుకున్న అందరికి రెండు డోసులను ఇస్తున్నారు. వీరిలో వ్యాక్సిన్‌ తీసుకోకముందే కోవిడ్‌ సోకి కోలుకున్న వారు కూడా ఉన్నారు. కానీ కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ ఇస్తే సరిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఇందుకు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 5 మధ్య టీకాలు వేసుకున్న 260 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఓ అధ్యయనం నిర్వహించినట్లు ఆసుపత్రి నిపుణులు తెలిపారు. వీరిలో కరోనా బారిన పడిన వారు, కరోనా బారిన పడని వారు ఉన్నారు.

వీరందరికీ ఆక్స్‌ఫర్డ్‌-సీరం వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పరిధోధన ద్వారా రెండు ముఖ్యమైన పరిశీలనలు వెలుగులోకి వచ్చాయన్నారు. కరోనా సోకని వారితో పోలిస్తే ఇంతకముందే వైరస్ బారినపడి తగ్గిపోయి ఒక డోసు వేసుకున్న వారిలో గణనీయంగా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. కోవిడ్‌ సోకని వారితో పోల్చితే, గతంలో సోకిన వారిలో ఒకే డోస్‌ వ్యాక్సిన్ ద్వారా పొందిన మెమరీ టి-సెల్ స్పందనలు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు కూడా  వెల్లడైనట్లు తెలిపారు.మొత్తానికి కోవిడ్ సోకినా ఎవరైనా ఒక్క డోసు తోనే యాంటీబాడీలు బాగా వృద్ది చెందుతాయని, రెండోది అవసరం లేదని అన్నారు.

కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల తొలి టీకా డోసు తీసుకంటే..అది రెండు టీకా డోసులకు సమానమైన రోగనిరోధశక్తిని ప్రేరేపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. మిగిలిన వాటిని ఇతరులు ఉపయోగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. అంతేగాక మిగిలిన డోస్‌లను వీలైనంత ఎక్కువ మందికి అందించేందుకు సహయపడుతుందని  ఏఐజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

చదవండి: వ్యాక్సిన్‌ తీసుకున్నాక పాజిటివ్‌: అపోలో ఎండీ సంగీతారెడ్డి

మరిన్ని వార్తలు